కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా

బెంగళూరు జూలై 29(తెలుగుపత్రిక ప్రతినిధి): కన్నడనాట కమలనాథులు బల పరీక్షలో నెగ్గిన కాసేపటికే స్పీకర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ గా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి సమర్పించారు. రమేశ్ కుమార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయానికి సభలోని సభ్యులందరూ షాక్ కు గురయ్యారు. రాజీనామా పత్రాన్ని ఇచ్చిన అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటి నుంచి తాత్కాలిక స్పీకర్గా కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని సాయంత్రం 5గంటలకు వాయిదా వేశారు. ఈ సందర్భంగా రమేశ్ కుమార్ భావోద్వేగంతో మాట్లాడారు. 14నెలల 4 రోజుల పాటు నేను స్పీకర్గా పనిచేశాను. నన్ను అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక స్పీకర్లా కాకుండా ప్రజల కోణంలో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకున్నాను. నా విధిని 100% నిర్వర్తించానని గర్వంగా చెప్పుకోగలను. కానీ మధ్యలో కొన్ని అవాంతరాలు కలిగాయి. స్పీకర్ కు ఎలాంటి హక్కులు, నిబంధనలు ఉంటాయో వాటికి అనుగుణంగానే నడుచుకున్నాను. నా వైపు నుంచి సభలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే నన్ను క్షమించండి. నా మాటలు, చేతల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మన్నించండి. సోనియాజీ నన్ను పిలిచి స్పీకర్గా ఉరమేశ్ ండాల్సిందిగా కోరారు. ఆమె నన్ను ఆదేశించలేదు. అభ్యర్థించారు. నాకు అసక్తి ఉంటేనే కొనసాగమని చెప్పారు. నాకు పార్టీలో అంత స్వేచ్ఛ లభించింది. నాకు తెలిసి స్పీకర్గా ఉండటం నా జీవితంలో అతి పెద్ద పురోగతి' అని చెప్పి ముగించారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రమేశ్ కుమార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రకంపనలకు కారణమైన అసమ్మతి ఎమ్మెల్యేల పై ఆయన కొరడా ఝుళిపించారు. ప్రజాప్రతినిధుల హక్కులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధరిస్తూ 15వ విధానసభ కాలపరిమితి ముగిసేంత వరకు 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ప్రకారం కాంగ్రెసకు చెందిన 11 మంది, జేడీఎస్ సభ్యులు ముగ్గురిపై ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉరమేశ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం రేపింది. వారు ఆయా పార్టీల విప్లను ఉల్లంఘించి సభకు గైర్హాజరయ్యారు. గత గురువారం ఇద్దరు కాంగ్రెస్, ఓ స్వతంత్ర శాసనసభ్యుడిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితో కలిపి మొత్తం 17మందిపై అనర్హత వేటు పడింది.